వాషింగ్టన్ లో జరిగిన ఘటనపై వివిధ దేశాల స్పందన
వాషింగ్టన్లోని కేపిటల్ హిల్ భవనం ముందు జరిగిన ఘర్షణలు, కాల్పులపై ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల నేతలూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింస ఆవేదన కలిగించింది. పద్ధతి ప్రకారం, శాంతియుతంగానే అధికా బదిలీ అనే కార్యక్రమం జరగాలి. చట్ట వ్యతిరేక నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ పక్కదోవ పట్టడం మంచిది కాదు.’అని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
జపాన్… జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రెటరీ కాట్సునోబు కాట మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఈ అంశం అమెరికా అంతర్గతం. దీనిపై తాము కామెంట్ చేయం. ఈ పరిస్థితులను అధిగమిస్తుందని ఆశిస్తున్నాం. అధికార మార్పిడి శాంతియుతంగా బదిలీ కావాలన్నదే మా అభిప్రాయం.’ అని కాట్సునోబు ప్రకటించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్…. ‘మేము ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతున్నాము. అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మేము బలంగా నమ్ముతున్నాము’ అంటూ ఇమ్మాన్యుయేల్ అన్నారు.
అమెరికాలో జరిగిన సంఘటన అత్యంత అవమానకరమని యూకే ప్రధాని బోరిక్ జాన్సన్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం విషయంలో అమెరికాకు పేరుందని, ప్రస్తుత పరిస్థితుల్లో శాంతియుతంగా, రాజ్యాంగ బద్ధంగా అధికార మార్పిడి జరగాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజాస్వామ్యం ఎంతో అవసరమని బోరిక్ జాన్సన్ నొక్కి వక్కాణించారు.
కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తాము ఫాలో అవుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. అమెరికాలోని సంస్థలు ఎంతో బలమైనవని, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు జస్టిస్ ట్రూడో తెలిపారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందిస్తూ… వాషింగ్టన్లో నెలకొన్న పరిస్థితులు బాధ కలిగించాయని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలను తాము ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్య యుతంగా అమెరికా గొప్ప దేశమని తెలిపారు.
ఇలాంటి దేశంలో అధికార మార్పిడి సజావుగా జరగాలని, తమ కోరిక కూడా అదేనని ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.






