అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం
అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ గ్రాండ్జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది.






