డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ఉండి, కొత్త అధ్యక్షుడికి తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే తన బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని సహజంగానే చాలా మంది అనుకుంటారు. తన హయాంలో కొన్ని సంచలన నిర్ణయాలతో, దూకుడైన ధోరణితో ముందుకు వెళ్లిన ట్రంప్.. ఇప్పుడిక తన దృష్టిని ఫ్యామిలీ బిజినెస్ పైకి మళ్లించారు. కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా తన వ్యాపారాలను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం మొదలు పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండానే హెలికాప్టర్ ఎక్కి ఫ్లోరిడా వెళ్లినపోయిన ట్రంప్.. ఇక సీరియస్‌గా బిజినేస్ చేయాలని నిర్ణయించారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో బడా వ్యాపారవేత్త. ఆయనకు హోటళ్లు, రిసార్ట్‌ల వ్యాపారాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడవన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. డోరల్ గోల్ఫ్ ప్రాపర్టీ, వాషింగ్టన్ హోటల్, రెండు స్కాటిష్ రిసార్ట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఆయన వ్యాపారాలన్నీ నష్టాల్లో ఉన్నాయని తేలడంతో పలు బ్యాంకులు, రియల్ ఎస్టేట్ బ్రోకరేజీలు, గోల్ఫ్ సంస్థలు ట్రంప్ కంపెనీకి కటీఫ్ చెప్పేయనున్నట్లు ప్రకటించాయి. ట్రంప్ కంపెనీ 30 కోట్ల డాల్లరుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. వచ్చే నాలుగేళ్లలోనే ఈ అప్పు చెల్లించాల్సి ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కలిసి ఆయన వ్యాపారాన్ని చూసుకున్నారు. అయితే తమ కంంపెనీల మరీ అంత కష్టాల్లో ఏమీ లేదని, గోల్ఫ్ బిజినెస్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నదని ఎరిక్ ట్రంప్ చెబుతున్నారు. ఇప్పుడీ వ్యాపారాలన్నింటిని మళ్లీ గాడిలో పెట్టే పనిలో ట్రంప్ ఉన్నారు.






