డ్రీమర్స్ ను కాపాడేందుకు చర్యలు : కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ప్రజలను కొవిడ్-19 నుంచి రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని, ఆ పదవికి నూతనంగా ఎన్నికైన కమలా హారిస్ అన్నారు. అంతేకాకుండా యూఎస్‌లో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న డ్రీమర్స్ కు పౌరసత్వం కల్పించే చర్యలు సైతం చేపడతామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. యూఎస్ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా నేను బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడమే మా ప్రథమ ప్రాధాన్యం. ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు కృషి చేస్తా అన్నారు.
అదేవిధంగా దేశంలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న డ్రీమర్స్ ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. 11 మిలియన్ల మందికి పౌరసత్వం కల్పించే విధంగా బిల్లు రూపొందించి కాంగ్రెస్‌కు పంపుతాం. అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి అమెరికాను తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ హారిస్ పేర్కొన్నారు.






