హిందుత్వపై విశ్వాసమున్నా.. క్రైస్తవ విలువలను గౌరవిస్తా
హిందుత్వలోని మూల సూత్రాలు నా జీవితంలో భాగంగా ఉన్నా క్రైస్తవ విలువలకు అత్యంత గౌరవమిస్తానని రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. అయితే క్రైస్తవ మతాన్ని విస్తరించే విషయంలో తాను అత్యుత్తమ అధ్యక్షుడు కాబోనని పేర్కొన్నారు. అయోవాలోని సీఎన్ఎన్ టౌన్‌హాలులో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. తన మతం, వలస, సరిహద్దు భద్రత, ఆర్థిక అసమానత్వంపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అధ్యక్షుడిగా మత స్వేచ్ఛపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ దేశ విశ్వాసం, దేశభక్తి, కుటుంబం, కష్టపడేతత్వం వంటివాటిని నిలబెట్టే బాధ్యత నాది. తదుపరి అధ్యక్షుడిగా నా విధి అదే. దేవుడు ఎవరిద్వారా తన పనిని చేయిస్తారనేది మనం నిర్ణయించేది కాదు. అది దేవుడే నిర్ణయిస్తారు. దేవుడు మనల్ని ఇక్కడ ఒక లక్ష్యం కోసం నిలబెట్టారు అని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.






