వివేక్ రామస్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు.. నేనొస్తే ఆ కేసులన్నీ
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న వివేక్ రామస్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసానికి పాల్పడిన లెఫ్టిస్టులు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) దుండగులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అమెరికా క్యాపిటల్ భవనం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన జనవరి 6 ఆందోళనకారులు ఇప్పటికే బెయిళ్లు లభించక జైళ్లలోనే ఉన్నారని పేర్కొన్నారు. బైడెన్ ఆధీనంలోని అన్యాయ విభాగం జనవరి 6న ఎటువంటి హింసకు పాల్పడకుండా ఆందోళన చేసిన 1,000 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసింది. న్యాయ దేవత, మన న్యాయ వ్యవస్థ పునాదులపై చీకట్లు ముసురుకున్నాయి. నేను అధ్యక్షుడినైతే దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు, రాజకీయ కక్షలతో కేసులు ఎదుర్కొంటూ చట్టపరమైన హక్కులకు దూరమైన అమెరికన్లందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తా. వీరిలో జనవరి 6వ తేదీన శాంతియుతంగా ఆందోళనలు చేసిన వారు ఉంటారు అని రామస్వామి వెల్లడించారు. అమెరికాలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగాన్ని తాను పూర్తిగా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు.






