అమెరికా రుణ పరిమితి బిల్లుకు సెనేట్ ఆమోదం
దివాలా (డిఫాల్ట్) ముప్పు నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లే. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై (ద్వైపాక్షిక ఒప్పందం) సెనేట్ తుది ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘమైన చర్చల అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 63-36 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. సంతకం కోసం అధ్యక్షుడు జో బైడెన్ డెస్క్‌కు పంపించారు. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. దేశ రుణ పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుతూ బిల్లును రూపొందించారు. అంటే మొత్తం అప్పులు 31.4 ట్రిలియన్ డాలర్లు దాటకూడదు. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో కొత్త అప్పులు తీసుకొని, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బడ్జెట్ కట్స్ ప్యాకేజీకి సైతం సెనేట్ ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం పొందడంలో అమెరికా ఇక ఊపిరి పీల్చుకోవచ్చని సెనెట్ మెజార్టీ నాయకుడు చుక్ షూమర్ తెలిపారు.













