అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు
ఆఖరి నిమిషయంలో అమెరికాకు షట్డౌన్ ముప్పు తప్పింది. స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రత్యేక చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం వహించి రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలించాయి. ఫలితంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆఖరి నిమిషంలో ఆమోదం లభించింది. మొత్తం మీద బిల్లుకు అనుకూలంగా 335 మంది, వ్యతిరేకంగా 91 మంది ఓటు వేశారు. దీంతో ఆఖరి నిమిషంలో ప్రతినిధుల (దిగువ) సభలో ద్రవ్య బిల్లు పాసైంది. దీంతో 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందులు తప్పాయి. అమెరికాలో ఆర్థిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్యబిల్లు ఆమోదం తప్పనిసరి. అక్టోబర్ 1 (ఆదివారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి లోపు ఈ బిల్లు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అక్టోబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు వేతనాలు, వివిధ పథకాలకు నిధులు అందించడం సాధ్యమవుతుంది. లేదంటే అన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.






