మోదీ చరిత్రాత్మక పర్యటన కోసం… ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం
21వ శతాబ్దంలో భారత్‌ను మించిన భాగస్వామి లేనేలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వసిస్తున్నారని శ్వేతసౌధం తెలిపింది. భారత్-అమెరికా బంధాన్ని మించిన ద్వైపాక్షిక సంబంధం భూగోళంలోనే ఏ దేశంతోనూ అమెరికాకు లేదనేది అధ్యక్షుడు బైడెన్ నమ్మకం. ప్రస్తుత సవాళ్ల కాలంలో అత్యుత్తమ బంధాన్ని నిర్మించుకోవడానికి భారత్‌ను మించిన భాగస్వామి లేదని ఆయన విశ్వసిస్తున్నారు అని వెల్లడించింది. అమెరికాలో ఈ నెల 21 నుంచి 24 వరకూ భారత ప్రధాని మోదీ అధికారిక పర్యటన జరపనున్న నేపథ్యంలో శ్వేతసౌధం అధికారి ఒకరు మాట్లాడారు.
ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సులో మోదీ, బైడెన్లు ప్రపంచ అంశాలపై పలుమార్లు చర్చించారు. వాషింగ్టన్లోనూ అనేక అంశాలపై వారిద్దరూ మాట్లాడుకోనున్నారు. టెక్నాలజీ, వాతావరణ మార్పులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు అని వివరించారు. మోదీ చరిత్రాత్మక పర్యటన కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామని అధ్యక్షుడు ఉప సలహాదారుడు కర్ట్ క్యాంపెబెల్ పేర్కొన్నారు. అనేక మంది ఈ కార్యక్రమం కోసం వాషింగ్టన్ వస్తున్నారని వెల్లడిరచారు.






