ట్రంప్ శకం ముగిసింది….
మన పెద్దలు ఓ మాట చెబుతుంటారు. అధికారం వచ్చింది కదా అని విర్రవీగవద్దు. అది నీ వినాశనానికే దారి తీస్తుందని హెచ్చరిస్తుంటారు. ఆ మాట అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో నిజమైంది. అధికార దాహం ఎంతటిపనినైనా చేయిస్తుంది. అధికారంకోసం ఎంతకైనా తెగిస్తానన్నట్లుగా ట్రంప్ వ్యవహరించిన తీరు చివరిరోజుల్లో ఆయనకు అవమానాలనే తెచ్చిపెట్టింది. ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుభూతి, ఇమేజ్ కూడా మొన్నటి క్యాపిటల్ భవనంలో జరిగిన రగడతో తుడిచిపెట్టుకుపోయింది.
అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో నిన్న మొన్నటి వరకూ ఓ రకమైన ఉన్నతమైన అభిప్రాయం ఉండేది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలూ ఉండే దేశమని ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాల స్వర్గమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది నాలుగేళ్ల కిందటి వరకే. నాలుగేళ్లలో ఆ దేశం పరిస్థితి దిగజారిపోయింది. మొన్న జరిగిన సంఘటన అమెరికా ఇమేజ్ను మరింతగా తగ్గించివేసింది. ట్రంప్ తన గెలుపుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల్లో జాతీయవాదం పేరుతో విభేదాలను సృష్టించారు. విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో అమెరికన్లలో ఒకరిపై ఒకరికి విబేధాలు సృష్టించి గెలిచారు. తర్వాత అమెరికన్లకు అది నచ్చలేదు నిన్న జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించారు. మొదటి నుంచి ఓటమిని అంగీకరించలేకపోతున్న ట్రంప్.. తాను ఏ వ్యవస్థ మీద అయితే ఆధారపడి అధ్యక్షుడ్ని అయ్యాడో.. అదే వ్యవస్థపై తిరగబడి ఓడినా గెలవాలనుకున్నాడు. ప్రజాసామ్యానికి చిరునామాగా ఉన్న అమెరికాలో హింసతోనైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. కాని జరగలేదు. దీనివల్ల ట్రంప్ కోరిక నెరవేరకపోయినా, అమెరికా దేశం మాత్రం?ప్రపంచ దేశాల దృష్టిలో ఇమేజ్ను కోల్పోవాల్సి వచ్చింది. ట్రంప్ పదవి నుంచి దిగిపోతూ అమెరికా గౌరవాన్ని మంటగలిపాడు. రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుడిగా కూడా ట్రంప్ పేరు తెచ్చుకున్నాడు.
ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతూ దిగిపోతూ… చైనాను ఇరకాటంలో నెట్టేసి, చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబించి వైదొలిగిపోతారన్న వార్తలు మొదట్లో వచ్చాయి. ట్రంప్ స్వతహాగా మంచి వ్యాపారవేత్త. దీంతో… చైనాను ఏ రకంగా ఇబ్బంది పెట్టి అధ్యక్ష పీఠం దిగిపోతారో చూడండంటూ ఆ మధ్యలో ఆయన వర్గీయులు అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ కాలం మారింది. కాలం మారిన నేపథ్యంలో ట్రంప్ వైఖరీ మారిపోయింది. అధికార మార్పిడికి ట్రంప్ ససేమిరా ఒప్పుకోకపోవడం, ట్రంప్ వర్గీయులు ‘కేపిటల్’ భవనాన్ని చుట్టుముట్టడం లాంటి సంఘటనలు జరిగాయి. ఈ అల్లర్లను నివారించడానికి పోలీసులు కాల్పులు జరపడం, ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించిన తర్వాత పరిస్థితి చేజారింది. దీనంతటికీ ట్రంప్ మొండి వైఖరే కారణమని అందరూ తిట్టిపోశారు. ప్రజాస్వామ్యం పరిణతి సాధించిన అమెరికా లాంటి దేశంలో ఈ అప్రజాస్వామ్య వైఖరి ఏంటని వివిధ దేశాధినేతలు తీవ్రంగా నిరసించారు. అయినా సరే ట్రంప్ వైఖరిలో మార్పు రాకపోవడంతో ఏకంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ‘మొదట అమెరికా పౌరులకే, అమెరికాయే మొదలు’ అన్న జాతీయ భావాలను ప్రేరేపించి, అమెరికా పౌరుల్లో అభిమానాన్ని గూడు కట్టుకున్న ట్రంప్… చివరికి అత్యంత హేయమైన స్థితిలో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్నారు.
అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగిన తర్వాత ట్రంప్ పరిస్థితి?
ఈ నెల 20 తో ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం పూర్తవుతోంది. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ప్రత్యర్థి జోబైడన్, కమలా హారిస్‌తో పాటు చైనా ఆయన విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిదాయకంగా మారింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ చైనాతో ట్రంప్ విభేదిస్తూనే ఉన్నారు. మరి కొన్ని సంవత్సరాల్లో అమెరికా, భారత్‌ను దాటిపోయి సూపర్ పవర్‌గా ఎదిగి, ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది. అందుకే అన్ని దేశాల పైకీ కయ్యానికి కాలు దువ్వుతోంది. చివరికి ట్రంప్‌తోనూ ఇలాగే ప్రవర్తించింది. అమెరికా పెట్టుబడి మూలాలున్న దేశం. చైనా కమ్యూనిస్టు దేశం. దీంతో సహజంగానే వారిద్దరికీ పొసగదు. ఈ సైద్ధాంతిక వైరుద్ధ్యాన్ని కాసేపు పక్కనపెడితే… చైనా విషయంలో ట్రంప్ కాస్త కర్కశంగానే ఉంటున్నారు. కరోనా వైరస్ విషయంలోనూ చైనాను సూటిగా విమర్శించారు ట్రంప్. అది కరోనా వైరస్ కాదని, అది బీజింగ్ వైరస్సేనని తిట్టిపోశారు. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య విషయాల్లోనూ ట్రంప్ కఠినంగానే ప్రవర్తించారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో చైనాకు చెందిన 70 కంపెనీలపై ట్రంప్ నిషేధం విధించారు. అగ్రశ్రేణి చిప్‌మేకర్ ఎస్ఎంఐసీ, చైనా డ్రోన్ తయారీ సంస్థ ఎస్జెడ్ డీజేఐ టెక్నాలజీ కో లిమిటెడ్‌తో పాటు పెద్ద సంఖ్యలో చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసింది. తాజాగా చైనాకు చెందిన మరో 8 యాప్‌లపై ట్రంప్ నిషేధం విధించారు. ఇలా ట్రంప్.. చైనాపై కత్తి దూస్తూనే ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం అమెరికా వేదికగా మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లోని చైనా రాయబారి కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కొన్ని కీలకమైన పత్రాలు కాలిపోయాయి. తర్వాత తేలిన విషయం ఏంటంటే… అమెరికాకు కొన్ని పత్రాలు లభించకుండా చైనా అధికారులే ఇలా కాల్చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ పత్రాల్లో ఏముందనేది ఆసక్తిదాయకం. వీటితో పాటు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయాలనూ ట్రంప్ మూసేశారు. చాలా సంవత్సరాలుగా గూఢచర్యం, హ్యాకింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకే చైనా రాయబార కార్యాలయాలను మూసేస్తున్నామని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక ఎన్నికల్లో గెలిచిన జోబైడన్ విషయంలోనూ ట్రంప్ మొండిగానే ప్రవర్తించారు. అధికార మార్పిడి ఏమాత్రం సహకరించకుండా మొండి ఘటంగా మారిపోయారు. ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయంటూ నిరాధార ఆరోపణలు చేసి ప్రపంచం ముందు నవ్వులపాలయ్యారు. అంతేకాకుండా అమెరికా పరువు కూడా తీసేశారు. ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్న జోబైడెన్ కాస్త వామపక్ష భావాల వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయమూ ఉంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని… అటు చైనా, ఇటు బైడెన్ కూడబలుక్కొని ట్రంప్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. తమపై ఇంత కక్షపూరితంగా వ్యవహరించిన ట్రంప్‌పై చైనా కూడా కఠినంగానే ఉండే అవకాశాలున్నాయని, ఈ ఒక్క విషయంలో జోబైడెన్‌పై ఒత్తిడి తెచ్చే సూచనలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరో వాదన కూడా ఉంది. ట్రంప్‌కు శ్వేత జాతీయుల మద్దతు పరిపూర్ణంగా ఉందని, దీంతో ఆయన ప్రత్యర్థులు కాస్త వెనక్కి తగ్గే అవకాశాలూ ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.
కొత్త సమస్యల్లో ట్రంప్
తన పదవీకాలం పూర్తయ్యాక ట్రంప్ కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. వ్యాపారవేత్త అయిన ట్రంప్‌కు ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి. అందులో కాపిటల్ హిల్ పైభాగంలో మాజీ వాషింగ్టన్ డీసీ పోస్టాఫీసుపైన నిర్మించిన ట్రంప్ హోటల్ కూడా ఒకటి. గత నాలుగేండ్లుగా ట్రంప్‌తో వ్యాపారం కోసం వచ్చే విదేశీ ప్రభుత్వాలు ఇక్కడే గదులు బుక్ చేసుకుంటూ.. ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నాయి. దాంతో ట్రంప్ కుటుంబం భారీగా సంపాదిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రదేశంలో హోటళ్ళు నడపడం ఇప్పుడు ట్రంప్‌ను బాధపెట్టనున్నది. ఇలాంటి వ్యవహరాలపై పలువురు రాజకీయ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వాషింగ్టన్‌లోని ఆస్తితోపాటు తన అనేక హోటళ్ళు, వ్యాపారాలను కోల్పోయాడని, గత వారం జరిగిన సంఘటన అనంతరం చాలా కంపెనీలు ట్రంప్‌తో వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నాయని వాషింగ్టన్‌లోని సిటిజెన్స్ ఫర్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ ఎథిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోహ్ బుక్‌బైండర్ పేర్కొన్నారు. ”ట్రంప్‌కు ఇది చాలా కష్టమైన సమయం” అని డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్ర రాసిన రచయిత మైఖేల్ డీ ఆంటోనియో అన్నారు. యూఎస్‌లో హింస వారి కంపెనీలకు మార్కెట్లోకి ప్రతికూలతను తెచ్చిపెట్టిందని తెలిపారు.
ట్రంప్ మద్దతుదారులు గత వారం యూఎస్ కాపిటప్పై దాడి చేయడంతో నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా చాలా కంపెనీలు ట్రంప్‌తో సంబంధాలను ముగించాయి. ట్రంప్‌కు చెందిన న్యూజెర్సీ గోల్ఫ్ కోర్సులో పీజీఏ అమెరికా ఇకపై ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే ట్రంప్ ఖాతాలతోపాటు క్యాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ట్రంప్ మద్దతుదారుల అకౌంట్లను కూడా సస్పెండ్ చేశాయి.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులకు కూడా ట్రంప్ కారణంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. ట్రంప్ వైఖరి కారణంగా అమెరికా పెద్ద కంపెనీలు రిపబ్లికన్లకు విరాళాలు ఇవ్వడానికి ఇకపై నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్, కామర్స్ బ్యాంక్, డౌ కెమికల్, మారియట్, మాస్టర్ కార్డ్, అమెజాన్ ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించడాన్ని వ్యతిరేకించిన 147 మంది రిపబ్లికన్లకు చాలా కంపెనీలు విరాళాలు ఇవ్వవు. వీరిలో మిస్సౌరీకి చెందిన సెనేటర్ జోష్ హౌల్, కాన్సాస్కు చెందిన సెనేటర్ రోజర్ మార్షల్, టెక్సాస్‌కు చెందిన సెనేటర్ టెడ్ క్రజ్, అలబామాకు చెందిన సెనేటర్ టామీ ట్యూబర్‌విల్లే, వందలాది మంది ఇతర కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.
500కు పైగా వ్యాపారాలు
ట్రంప్ కుటుంబానికి దాదాపు 500 రకాల వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అతని పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి. హోటళ్ళు, రిసార్ట్స్, మల్టీ మిలియన్ డాలర్ల గోల్ఫ్ క్లబ్‌లు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభలిన సమయంలో ట్రంప్ కంపెనీలు మిలియన్ డాలర్లను కోల్పోయాయని ఫోర్బ్స్ పత్రిక ఒక నివేదికలో తెలిపింది. ఈ సమయంలో అతని నికర విలువ 100 మిలియన్ డాలర్లకు తగ్గింది. ఫోర్బ్స్ ప్రకారం, ట్రంప్ నికర విలువ 2.5 బిలియన్ డాలర్లు.
భారత్‌లో కూడా వ్యాపారాలు
భారతదేశంలో కూడా ట్రంప్ వ్యాపారాలను ఇతర సంస్థలతో కలిసి చేశారు. ముంబై, పుణేలో డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ టవర్‌ను నిర్మించారు. ఈ టవర్‌ను పంచీల్ డెవలపర్స్‌తో కలిసి ట్రంప్ నిర్మించారు. ముంబైకి చెందిన టవర్‌ను లోధా గ్రూప్ నిర్మించింది. పుణేలో నిర్మించిన 23 అంతస్తుల ట్రంప్ టవర్.. దేశంలో మొదటి పర్యావరణ అనుకూల భవనం కావడం విశేషం. బాలీవుడ్ తారలు కూడా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. దీనిలోని ఒక్కో ఫ్లాట్ ధర రూ.15 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ట్రంప్‌కు గుర్గావ్లోని ఎం 3 ఎం ఇండియా, గుర్గావ్లోని ఐఆర్‌ఈఓ, కోల్‌కతాలోని యూనిమార్క్ గ్రూప్, రియల్ ఎస్టేట్‌తో సంబంధాలు ఉన్నాయి.
ఎంతో ఉత్సాహంతో ప్రజల కరత్వాళ ధ్వనుల మధ్య అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్ చివరకు పదవీకాలం చివరిలో చేసిన తప్పులతో అవమానభారంతో పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ట్రంప్ జీవితం ఓ విధంగా చాలామందికి పాఠంలా కనిపిస్తోంది.






