ఎక్కడైనా, ఎప్పుడైనా ఉత్తర కొరియాతో.. చర్చలకు సిద్ధం

ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా ఉత్తర కొరియాతో చర్చలకు తాము సిద్ధమేనని అమెరికా తెలిపింది. అమెరికాతో చర్చలకైనా, ఘర్షణకైనా తాము సిద్దమని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చేసిన ప్రకటనకు స్పందనగా ఉత్తర కొరియా వ్యవహారాలు చూసే అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్ కిమ్ ఈ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించగలదని భావిస్తున్నట్లు సంగ్ కిమ్ తెలిపారు. దక్షిణ కొరియాలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన సంగ్ కిమ్ అక్కడ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఉత్తర కొరియాపై చేసిన తీర్మానాలన్నీ పూర్తిగా అమలయ్యేలా చూడాల్సిందిగా రాయబారి కిమ్ భద్రతా మండలి సభ్యులను కోరారు. తీర్మానాల ప్రకారం ఉత్తర కొరియా చమురు దిగుమతులను పరిమితం చేసి, బొగ్గు, జౌళి, చేపలు, తదితరాల ఎగుమతులను కూడా పరిమితం చేయాల్సి వుంది. అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా కలిగించే ముప్పును దృష్టిలో పెట్టుకుని తాము భద్రతా మండలి తీర్మానాలను పూర్తిగా అమలు చేస్తామని, ఇతర దేశాలు కూడా అలాగే చేయాలని రాయబారి కోరారు. నిషేధిత అణ్వాయుధాలు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను వదులుకునేలా ఒప్పించేందుకు దౌత్యపరమైన కృషితో పాటు ఆచరణాత్మక వైఖరిని అనుసరిస్తామని బైడెన్ ప్రభుత్వం గతంలో పేర్కొంది.