ఆ దేశంపై ఆధారపడొద్దు.. చర్చా వేదికలో వివేక్
మన ఆధునిక జీవన విధానమంతా చైనాపై ఆధారపడి ఉండటం వల్ల ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నామని, బీజింగ్ నుంచి అమెరికా ఆర్థిక స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని మయామీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మూడో చర్చ వేదికలో రామస్వామి మాట్లాడారు. చైనా సరఫరా వ్యవస్థపై అమెరికాలోని కీలక రక్షణ పారిశ్రామిక రంగం ఆధారపడి ఉంది. ఇలాగైతే మన శత్రువు చైనా కంటే మనం బలవంతులు కాలేం. ఔషధాల కోసం మనం ఆ దేశంపై ఆఢారపడినట్లే సెమీకండక్టర్ల కోసం ఆధారపడుతున్నాం అని పేర్కొన్నారు.
అధ్యక్ష అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ట్రంప్ మళ్లీ డుమ్మా కొట్టారు. మనకు స్వతంత్రంగా వ్యవహరించే రాజకీయ నాయకులు కావాలి. మనల్ని మరింతగా ఆధారపడేలా చేసే చైనా లాంటి శక్తులను అడ్డుకోవాలి. షీ జిన్‌పింగ్‌కు నేను ఒక సందేశమిస్తున్నాం. మా దేశంలో మీరు భూములను కావాల్సినంతగా కొన్నారు. కానీ మా విశ్వవిద్యాలయాలకు డొనేషన్లు ఇవ్వరు. మీ విధానాలను మార్చుకునేంత వరకు చైనా మార్కెట్లో అమెరికా వ్యాపారాలను విస్తరించబోం అని వివేక్ పేర్కొన్నారు.






