ట్రంప్ వైఖరిపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు
యూఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఊహించని రీతిలో ఓటమి పాలైన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన వెర్రిచేష్టలతో అధికారమార్పిడికి మోకాలొడ్డుతున్నారు. అధికారదాహంతో ఊగిపోతూ.. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తన మద్దతుదారులను ఉసిగొల్పుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి జరగడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారుచేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యవహారశైలి కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని, అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించేందుకు కేబినెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా మంత్రిమండలి సిద్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోందని, విచక్షణ కోల్పోయి ఆందోళనకు కారణమైన ట్రంప్ ఏ క్షణంలోనైనా పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని రిపబ్లికన్ నాయకులు అన్నట్లు సీఎన్ఎన్ కథనం వెలువరించింది.
ఒకప్పుడు శాంతికి చిహ్నంగా నిలిచిన శ్వేతజాతీయులు నడిరోడ్డుపై నిరసనలకు దిగుతున్నారు. బైడెన్ గెలుపును అధికారికంగా దృవీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. అందోళకారులు శాంతించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఓ వీడియోను విడుదల చేసినా.. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ట్రంప్ మద్దతుదారులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతోపాటు మరోముగ్గురు మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన యావత్ ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది.
ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా చెప్పుకునే అమెరికాలో అధికార మార్పిడి హింసాత్మకంగా మారడంలో ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ ముందు జరిగిన ఘర్షణపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాన బోరిస్ జాన్స్‌న్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంలో అధికార మార్పడిన శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పెద్దన్నగా వర్ణించే యూఎస్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం. నిరసనకారులను శాంతింపచేయాల్సిన బాధ్యత వారి నేతలకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి ఆమోద యోగ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. ఇక క్యాపిటల్ భవన్ ముందు చెలరేసిన హింసపై జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని అంగీకరించలేకనే ట్రంప్ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు అంటూ మండిపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేస్తూ ట్విటర్ యాజమన్యం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఖాతాను 12 గంటలపాటు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లు తొలగించాలని తొలుత ట్రంప్‌ను కోరగా.. ఆయన స్పందించకపోవడంతో ట్వీట్లు తొలగించి అన్‌లాక్ చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తుండటంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన వ్యక్తిగత సలహాదారులతో ట్రంప్ చర్చిస్తున్నట్లు సమాచారం.






