అమెరికా ఘటనపై ఐరాస ఆందోళన!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన బీభత్సంతో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నాయకులు పరిణతితో మద్దతుదారులను సముదాయించాలని సూచించింది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కాపిటల్లో జరిగిన ఘటనపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తీవ్ర విచారణం, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా తమ మద్దతుదారులను శాంతింపజేయడంలో రాజకీయ నాయకులు ప్రయత్నించడం ఎంతో ముఖ్యం. అంతేకాకుండా చట్టాలను ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఐరాస అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగించే విషయమని ఐరాస జనరల్ అసెంబ్లీ 75వ సమావేశాలకు అద్యక్షుడిగా ఉన్న వోల్కన్ బోజ్కిరి ఆవేదన వ్యక్తం చేశారు.






