America: అమ్మో ట్రంప్, పార్ట్ టైం జాబ్స్ కు గుడ్ బై…!

ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్ళిన అనేక మంది భారత విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ (Part Time Jobs) కు దూరంగా ఉంటున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. కాలేజి లేని టైం లో డబ్బు సంపాదించేందుకు గానూ.. ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో అమెరికా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనితో దేశ బహిష్కరణకు భయపడి ఉద్యోగాలను వదిలేస్తున్నారు. జనవరి 20న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు నుంచి ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నారు విద్యార్ధులు. ఉద్యోగాల కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టలేని విద్యార్ధులు ఉద్యోగాలను వదిలేస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్ళిన విద్యార్ధులు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యార్థులు అద్దె, కిరాణా, ఇతర వ్యయాలు వంటి ఖర్చులను భరించడానికి రెస్టారెంట్లు, పెట్రోల్ స్టేషన్లు లేదా రిటైల్ దుకాణాలలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది విద్యార్ధులు లోన్ తీసుకుని అమెరికా వెళ్ళారు. ఏ మాత్రం తేడా వచ్చినా ట్రంప్ సర్కార్ బహిష్కరించే అవకాశం ఉండటంతో.. విద్యార్ధులు చాలా వరకు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
తమ తల్లి తండ్రులు.. తమను అమెరికా పంపించేందుకు చాలా కష్టపడ్డారని.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనవసరంగా వీసా క్యాన్సిల్ అయితే అప్పుల పాలు అయిపోతామని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్నాళ్ళు ఉద్యోగాలకు విరామం ఇచ్చి ఆ తర్వాత తిరిగి జాయిన్ అవుతామని తెలిపారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఎక్కువగా విద్యార్ధులపై పడుతోంది. ఇటు భారత ప్రభుత్వం కూడా అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. హెచ్ 1 బీ వీసాలపై ఉన్న వారి విషయంలో కూడా ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనపడుతున్నాయి.