Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ ‘క్రిస్మస్ ఆఫర్’.. క్యాష్, ఫ్లైట్ ఫ్రీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల (Illegal Immigrants) కోసం అనూహ్యమైన “క్రిస్మస్ ఆఫర్” ప్రకటించారు. ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ ఏడాది చివరిలోగా దేశం విడిచి వెళ్ళే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) నగదు బహుమతితో పాటు, ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది. అంతేకాకుండా వారిపై ఉన్న జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేస్తామంది.
ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశంలో అక్రమ వలసల (Illegal Immigrants) ఏరివేతను వేగవంతం చేయడమేనని తెలుస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించుకోవాలనుకునే వారు ‘సీబీపీ హోమ్’ (CBP Home) అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణ ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుంది.
అయితే ఈ ఆఫర్ను తిరస్కరించి ఇంకా దేశంలోనే కొనసాగే (Illegal Immigrants) వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అలా పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి బలవంతంగా బహిష్కరిస్తామని, భవిష్యత్తులో వారు మళ్ళీ అమెరికా గడప తొక్కకుండా శాశ్వతంగా నిషేధిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికి గౌరవప్రదమైన వీడ్కోలు, మొండికేసే వారికి (Illegal Immigrants) కఠిన శిక్షలు ఉంటాయని ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ సర్కార్ సంకేతాలిచ్చింది.






