అరిజోనాలోనూ డొనాల్డ్ ట్రంపే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే విజయకేతనం ఎగరేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింత పెంచుకున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 49 ఫలితాలు ఇప్పటికే వెలువడగా చివరిదైన అరిజోనా కూడా ఆయన వశమైంది. దాంతో మొత్తంం ఏడు స్వింగ్ రాష్ట్రాలూ ట్రంప్ ఖాతాలోకే వెళ్లాయి. 11 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న అరిజోనాలో విజయంతో ట్రంప్ మొత్తం 312 ఓట్లు సాధించారు. 2016లో తొలిసారి నెగ్గినప్పుడు సాధించిన 304 ఓట్ల మార్కును ఆయన అలవోకగా దాటేయడం విశేషం. డెమోక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 226 ఓట్లకే పరిమితమయ్యారు.
దేశవ్యాప్తంగా దాదాపు 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటిదాకా ట్రంప్ 7,55,81,082 (50.5) ఓట్లు సాధించారు. హారిస్‌కు 7,17,08,435 (47.92 శాతం ) ఓట్లు దక్కాయి. మొత్తమ్మీద 31 రాష్ట్రాలు ట్రంప్ పరంగా కాగా హారిస్ 19 రాష్ట్రాలతో పాటు డీసీని దక్కించుకున్నారు. అరిజోనాలో 2020లో జో బైడెన్ నిలిచారు. ఆ రాష్ట్రంపై బాగా ప్రభావితం చూపే సరిహద్దు భద్రత, వలసలు, అక్రమ వలసదారుల నేరాలు, గతేడాది రికార్డు స్థాయి వలసలు తదితరాలపై ట్రంప్ చేసిన విస్తృత ప్రచారం ఆయనకు బాగా కలిసొచ్చింది.






