తాను విజయం సాధిస్తే .. అద్భుతాన్ని సృష్టిస్తా : ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిచిగాన్లోని డెట్రాయిట్లో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఆర్థిక విధానాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఆమె విఫల ఆర్థిక అజెండా కారణంగా ఇటీవలే ప్రైవేటురంగంలో 30 వేల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. తయారీరంగంలోనూ దాదాపు 50 వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొన్నారు. హారిస్ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హారిస్ విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. వాటివల్ల అమెరికన్ కార్మికులు మునిగిపోతున్నారు. ఆమె ఒక రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్ట్. ఐసీఈని రద్దు చేస్తానని, మీ తుపాకులు జప్తు చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. కాని నేను మాత్రం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వేలకొద్దీ కర్మాగారాలను అభివృద్ధి చేస్తాను. నా పాలనలో హింసాత్మక నేరాలు జరగకుండా అణచివేస్తాను అని పేర్కొన్నారు.






