‘జాతీయత’తో పీఠమెక్కి… ‘అవమానకరం’గా దిగిపోతున్నారు
అధికారంలోకి వచ్చింది జాతీయతతోనే. జాతీయత చుట్టూనే ‘అగ్రరాజ్య’ రాజకీయాలను ట్రంప్ నడిపారు. ‘అమెరికా అమెరికా వాళ్లదే. ‘అమెరికా గ్రేట్ అగైన్’ అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా అమెరికాలోని ఉద్యోగాలు మొదట అమెరికన్లకే దక్కాలంటూ పెద్ద ఎత్తున నినాదాలను ప్రచారం చేశారు. ఈ రకమైన జాతీయ నినాదంతో అమెరికన్లకు ట్రంప్ చాలా దగ్గరయ్యారు.
2016 లో జరిగిన ఎన్నికల్లో ఈ నినాదాలే ట్రంప్‌ను ‘అగ్ర’పీఠంపై కూర్చోబెట్టాయి. ఇంతలా అమెరికన్ల హృదయాల్లో ఓ స్థానం సంపాదించుకున్న ట్రంప్… చివరకు అమెరికాను, సొంతంగానూ అభాసుపాలవుతూ కుర్చీ నుంచి దిగిపోవాల్సిన దౌర్భాగ్య స్థితికి పరిణామాలు దారితీశాయి. సొంత పార్టీ ప్రతినిధులే రాజ్యాంగంలోని 25 వ అధికరణం ద్వారా పదవి నుంచి తప్పించాలని వ్యూహం పన్నారు.
చివరికి ట్రంప్ తన ఓటమిని అంగీకరించారు. అయితే ఈ జాతీయవాద నినాదాలతో ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నా, అమెరికన్లలో మాత్రం జాతీయభావం నిండేలా ప్రచారం చేశారు. అంతేకాకుండా మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని కూడా ట్రంప్ అమెరికన్లకు హామీ ఇచ్చారు. అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేంత వరకూ సైన్యాన్ని మోహరించే విషయమై రక్షణ శాఖ అధికారులతోనూ చర్చించానని ప్రచారంలో ట్రంప్ వెల్లడించారు. ఇలా జాతీయవాదాన్ని పూర్తిగా ప్రజల్లో నింపిన ట్రంప్‌కు అమెరికా స్థానికులు నెత్తిన ఎత్తుకున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజులు కూడా లేనివేళ.. అమెరికాను కోవిడ్ వెంటాడింది. కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో రోజుకు 90 వేల మందికి వైరస్ సోకింది. రోజుకు వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ట్రంప్‌ను మరింత బెంబేలెత్తించింది. కరోనా సమయంలో సొంత జాగ్రత్తలే పాటించని ట్రంప్… ఇక దేశాన్ని ఏం రక్షిస్తారని ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డాక్టర్లపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ట్రంప్. కోవిడ్ చికిత్స పేరుతో డాక్టర్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే దేశంలో అనేక మంది చనిపోతున్నారని అంటున్నారని మండిపడ్డారు. ఈ మరణాలకు అనారోగ్యం సమస్యలు కారణాలు కావొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని వాదనలొచ్చాయి. ఈ సమయంలోనే ఎన్నికలు దగ్గరపడటంతో 18 ర్యాలీలు నిర్వహించారు. దీంతో కరోనా పెరిగిందని విమర్శలొచ్చాయి.
ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రెటిక్ పార్టీకి చెందిన జో బైడన్ ఘన విజయం సాధించారు. 306 ఎలక్టోరల్ ఓటర్లతో బైడన్ అధ్యక్స పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడే చిక్కంతా వచ్చిపడింది. ఈ విజయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోర్టుల్లో పలుమార్లు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. అయితే న్యాయస్థానాలు వాటిని కొట్టేసిన విషయం విదితమే. అయినా సరే ట్రంప్ తన మొంకి పట్టును వీడలేదు. చివరికి బుధవారం బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. దీంతో ట్రంప్ మద్దతుదారులంతా వాషింగ్టన్కు చేరుకున్నారు. చేరుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. ఆందోళన కారులను అదుపు చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు తమ ప్రాణాలను కోల్పోయారు.
మొండితనంతో అమెరికా పరువు పోయిందన్న యూఎస్ నేతలు
ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు అత్యంత సహజం. కానీ ట్రంప్‌లో గూడుకట్టుకున్న అధికార దాహం ఓటమిని అంగీకరించేలా చేయలేదు. అందుకే ట్రంప్ మద్దతుదారులను ఉసిగొల్పారు. ఆయన స్వార్థం కోసం చట్టసభల ప్రాంగణాన్నే రణరంగంలా మార్చిపారేశారు. ప్రజాస్వామ్యపరంగా, అభివృద్ధిపరంగా, విద్యాపరంగా ఎంతో ముందుందని భావిస్తున్న అగ్రరాజ్యంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులుతలెత్తడంపై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పరువుపోయిందని అధికారులు, మాజీ అధికారులు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా అయితే ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఘటనలకు ట్రంప్‌తో పాటు ప్రతినిధులూ బాధ్యత వహించాలి. ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానం. అకస్మాత్తుగా జరిగినవి కావు. ట్రంపే హింసను ప్రేరేపించారు.’’ అంటూ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికార దాహమే ఇంతటి దారుణాలకు ఒడిగట్టేలా చేశాయని అందరూ మండిపడ్డారు. పదవిలో కొనసాగేందుకు మరింత భీకరంగా పోరాడతానని ట్రంప్ ప్రకటన చేయడంతో ఆయన మద్దతు దారులు మరింత రెచ్చిపోయారు.
బైడెన్ ఎన్నికను ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్
ఇంత తతంగం, గొడవలు, ఘర్షణలు జరిగిన తర్వాత ఇక తన ఆటలు సాగవని గ్రహించిన ట్రంప్… ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. జోబడైన్దే గెలుపుని అమెరికా కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే ప్రకటించారు. తానే స్వచ్ఛందంగా వైదొలుగుతాని, అధికార మార్పిడి పద్ధతి ప్రకారం జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికాలో జరుగుతున్న ‘అధికార పోరు’కు తెర పడినట్టైంది. జోబైడన్ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుండగా, ట్రంప్ తన సొంత ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.






