Gold Card: గోల్డ్ కార్డులతో ప్రతిభావంతులైన భారతీయులను కాపాడుకోవచ్చు : ట్రంప్

అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చే ప్రతిభావంతులైన భారతీయ గ్రాడ్యుయేట్లను అమెరికా కంపెనీలు, గోల్డ్ కార్డు (Gold card)లను కొనుగోలు చేయడం ద్వారా నియమించుకోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో చదువుకునే విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు. ప్రస్తుత వలస విధానం భారత్ (India) లాంటి దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రతిభావంతులు అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి అడ్డంకిగా మారిందని స్పష్టం చేశారు.
భారత్, చైనా(China), జపాన్(Japan) తదితర దేశాల నుంచి వచ్చి హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదువుకునే వారికి మన దేశంలో ఉద్యోగ ఆఫర్లు వస్తున్నాయి. అయితే అవి వెంటనే రద్దవుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు సాధించినవారు అమెరికాలో ఉండవచ్చా, లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది. దీంతో అనేక మంది భారతీయ ప్రతిభావంతులు బలవంతంగా అమెరికాను వీడాల్సి వస్తోంది. వారంతా భారత్‌కు వెళ్లి కొత్త వ్యాపారాలను ప్రారంభించి, బిలియనీర్లుగా ఎదిగి వేల మందికి ఉద్యోగాలిస్తున్నారు అని క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఇబ్బందికి అధిగమించడానికి అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేసి వారి కోసం వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు వారు అమెరికాలోనే ఉండి దేశాభివృద్ధికి తోడ్పడతారని వివరించారు.