అలాంటి ఆలోచన లేదు.. మేము తప్పకుండా : ట్రంప్
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే మరోసారి పోటీ చేయబోనని రిపబ్లికన్ అద్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పేర్కొన్నారు. అయితే నవంబర్ 5న జరగబోయే ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఒకవేళ మేం ఓడిపోతే, 2028 ఎన్నికల్లో నేను బరిలోకి దిగను. ఇప్పుడు నేను విజయం సాధిస్తే, దాని వెనుక ముగ్గురి పాత్ర ఉంటుంది. కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తులసి గబ్బార్డ్‌కు చాలా విషయాలపై అవగాహన ఉంది. ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నడీ పనిచేస్తారు. దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తారు. పరిపాలనలో తులసి గబ్బార్డ్‌కు అనుభవం ఉంది. మేం వచ్చిన 12 నెలల్లోనే ఇంధనం ధరలను 50 శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఈ విధానం వ్యాపారులకు కూడా బాగా ఉపయోపగపడుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.






