డొనాల్డ్ ట్రంప్ నోట మళ్లీ అదే మాట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్న ట్రంప్ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోవడం లేదు. బైడెన్‌కు అనుకూలంగా పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందంటూ మరోసారి శుష్క వాదన చేశారు. జనవరి 5న రెండు సెనేట్ స్థానాలకు జరిగే ఎన్నికల కోసం జార్జియాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ మళ్లీ ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో మోసం చేసినట్లుగానే వారు (డెమొక్రాట్లు) ఈ ఎన్నికలనూ రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. దీంతోపాటు అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో తానే గెలిచానంటూ చెప్పుకున్నారు. వాస్తవానికి అక్కడ బైడెన్ గెలిచారు. అయితే ఇప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో మనమే గెలవబోతున్నామంటూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం.






