భారత సంతతి వ్యక్తికి అమెరికాలో ఉన్నత పదవి
భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో ఉన్నత పదవి లభించింది. ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ న్యాయవాది విజయ్ శంకర్‌ను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిస్ట్రిక్ట్ ఆప్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో అసోసియేట్ జడ్జిగా నియమించారు. ఈ పదవీ బాధ్యతలను జాన్ ఆర్ ఫిషర్ నుంచి స్వీకరించనున్న శంకర్.. ఆ స్థానంలో 15 సంవత్సరాల పాటు కొనసాగుతారు. శ్వేతసౌధం ఉన్న వాషింగ్టన్ డీసీకి సంబంధించినంత వరకు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలింబియా కోర్ట్ సర్వోన్నత న్యాయస్థానం కావటంలో ఈ నియామంక కీలకం కానుంది.
విజయ్ శంకర్ తన డిగ్రీని నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీలోనూ, న్యాయశాస్త్రంలో డాక్టరేటు పట్టాను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా నుంచి పొందారు. అనంతరం వర్జీనియా లా రివ్యూ అనే మీడియా సంస్థలో నోట్స్ ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. ఆపై 2012లో అగ్రరాజ్య న్యాయశాఖలో చేరేవరకు వాషింగ్టన్ డీసీలో ప్రైవేట్ ప్రాక్టీసు కొనసాగించారు. కాగా, శంకర్ ప్రస్తుతం అమెరికా న్యాయశాఖలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.






