మార్చి వరకూ భద్రతా చర్యలు.. ట్రంప్ అభిశంసన విచారణ కారణంగా బైడెన్ నిర్ణయం
అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజధాని వాషింగ్టన్కు తరలించిన వేలాది మంది జాతీయ భద్రతా సిబ్బందిని మార్చి మధ్య వరకు రాజధానిలో కొనసాగించాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన విచారణ పూర్తయ్యే వరకూ జాతీయ భద్రతా దళాలను (నేషనల్ హోమ్ గార్డులను) కొనసాగించక తప్పదని బైడెన్ భావిస్తున్నారు.
ట్రంప్‌పై అభిశంసన విచారణ వల్ల నగరానికి ఎటువంటి ముప్పు వాటిల్లేదీ అధికారులు వెల్లడించలేదు కానీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు వారు తెలియజేశారు.
గత జనవరి 6న కాంగ్రెస్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడులు జరపడాన్ని దృష్టిలో ఉంచుకుని, మున్ముందు మరిన్ని హింసాత్మక దాడుల జరిగే అవకాశం ఉందని బైడెన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అంతేకాదు, ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రారంభం అవుతుండడం కూడా ఈ చర్య తీసుకోవడానికి దోహదం చేస్తోంది.
రానున్న వారాలలో వాషింగ్టన్లో అనేక సంఘటనలు జరగనున్న దృష్ట్యా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఆపద్ధర్మ రక్షణ మంత్రి జాన్ విట్లే తెలిపారు.
నిరసన ప్రదర్శనలను కొన్ని అసాంఘిక శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని, హింసాత్మక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అటువంటివి జరిగే పక్షంలో శాంతిభద్రతల పరిరక్షణకు భద్రతా దళాలు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగి అయిదుమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు సైనికాధికారులు దేశ రాజధానికి జాతీయ భద్రతా దళాలను తరలించారు. ఈ దాడిని చొరబాటుగా అభివర్ణించడం జరిగింది. మొదట్లో వందల సంఖ్యలో ఉన్న భద్రతా దళ సిబ్బంది సంఖ్యను జనవరి 20న జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత 25,000కు పెంచారు. ఇందులో ప్రస్తుతం 13,000 మందిని వాషింగ్టన్లోనే ఉంచారు. జనవరి నెలాఖరుకు ఈ సంఖ్యను 7,000కు తగ్గిస్తారు. మార్చి మధ్యనాటికి ఈ సంఖ్య 5,000కు తగ్గుతుందని విట్లే తెలిపారు.






