చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటి వరకు వద్దన్న ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్‌కు అన్నివైపుల నుంచి మద్దతు దక్కుతోంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధులవుతున్నారు. ఆయనతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని తాజాగా వెల్లడిరచారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించేవరకు వేచి చూస్తానని వెల్లడించారు.
మీరు డిబేట్ గురించి నన్ను పలుమార్లు ప్రశ్నలు అడుగుతున్నారు. ట్రంప్‌తో డిబేట్‌కు నేను సిద్ధమే అని హారిస్ మీడియాకు తెలిపారు. ఆయన గతంలో చర్చకు సిద్ధమేనని, ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నారన్నారు. డెమోక్రాటిక్ పార్టీలో గందరగోళం కొనసాగుతున్న తరుణంలో వారు అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించేవరకు డిబేట్ తేదీ గురించి వెల్లడించలేం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.






