కమలా హారిస్ తో డొనాల్డ్ ట్రంప్ తొలి చర్చ… వచ్చే నెల 10న
అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో సంవాదానికి తాను సిద్దమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రకటించారు. తాను చెప్పిన షరతులకు ఒప్పుకొంటే మూడు చర్చల్లో పాల్గొంటానని తెలిపారు. ఇందుకు హారిస్ అంగీకారం తెలుపుతారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్-కమలతో డిబేట్‌కు సిద్ధమైనట్లు ఏబీసీ టీవీ ఛానల్ ధ్రువీకరించింది. వచ్చే నెల 10వ తేదీన ట్రంప్, హారిస్ చర్చలో పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 10న ఏబీసీ టీవీ ఛానల్లో చర్చకు తాను సిద్ధమని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. సంవాదంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.






