Harvard University :హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ షాక్

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి అందించే గ్రాంట్లు, కాంట్రాక్టులకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం కోత పెట్టింది. 2.2 బిలియన్ డాలర్ల నిధులను స్తంభింపజేసింది. మెరిట్ ఆధారిత ప్రవేశాలు, నియామకాలతో పాటు పాలన, నాయకత్వంలో సంస్కరణలు చేపట్టాలని, భిన్నత్వం విషయంలో అధ్యయన సంస్థ, ఫ్యాకల్టీ, నాయకత్వంపై ఆడిటింగ్ (Auditing )చేయాలని వర్సిటీని ప్రభుత్వం కోరింది. దీంతోపాటు క్యాంపస్‌లో ఫేస్ మాస్క్ (Face mask )లపై నిషేధం విధించాలని సూచించింది. దీనిద్వారా పాలస్తీనా అనుకూల ఆందోళనకారులను గుర్తించవచ్చనేది ప్రభుత్వ భావన. నేర కార్యకలాపాలను ప్రోత్సహించే, హింసకు పాల్పడే వేధించే గ్రూపులు, క్లబ్‌లకు నిధులను నిలిపేయాలనీ సర్కారు సూచించింది. దీనిని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ వర్గాలకు అధ్యక్షుడు అలన్ గార్బర్ (Alan Garber) లేఖ రాశారు.
ప్రభుత్వ డిమాండ్లు వర్సిటీ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వానికున్న రాజ్యాంగబద్ధ పరిమితులను మీరుతున్నాయి. విద్యార్థులపై జాతి, వర్ణం, జాతీయ వంటి అంశాల కారణంగా వివక్ష చూపడానికి దారి తీస్తున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, విద్యార్థులకు ఏం బోధించాలనే విషయంలో ప్రైవేటు వర్సిటీలను శాసించజాలవు. ఎవరికి ప్రవేశాలు కల్పించాలో, ఎవరిని నియమించుకోవాలో సూచించజాలవు అని ఆయన పేర్కొన్నారు. దీంతో నిధులను స్తంభింపజేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని పలువురు వ్యతిరేకిస్తున్నారు. నైతికతకు, విలువలకు స్వేచ్ఛకు తార్కాణంగా నిలిచే హార్వర్డ్ విశ్వ విద్యాలయం ఉన్నత విద్యకు ఫౌండేషన్ గా పని చేస్తోంది. అభ్యసనం, ఆవిష్కరణ, పరివర్తనాత్మక అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే హార్వర్డ్ బెదిరింపులకు, పెత్త నానాకి తలొగ్గదు అని వర్సిటీ పూర్వ విద్యార్థి అనురిమ భార్గవ (Anurima Bhargava ) స్పష్టం చేశారు.