Donald Trump: మీ వీసా రద్దు చేస్తున్నాం… అమెరికా నుంచి వెళ్లిపోండి

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందట చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు (Visas) రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. నార్త్ ఈస్ట్రన్, హ్యాంప్‌షైర్, విస్కాన్సిన్ మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థుల (Students)కు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులూ (Telugu students) ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయం (Northeastern University) లోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్నవారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి సంబంధించిన సెవీస్ ( స్టూడెంట్ అండ్ ఎక్ఛేంజి విజిటర్ ) ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లుతున్నారు. హమాస్ అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొందరిని పంపించేసింది.