అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ పార్టీలో కలకలం!
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ( సీపీసీ) కీలక నేత కుమార్తెతో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న టిమ్ వాల్జ్ ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఎన్నికల వేళ ఈ అంశం చర్చనీయాంశమైంది. టిమ్ వాల్జ్ 1989లో (అప్పట్లో ఆయన వయసు 25) చైనాలోని గ్యాంగ్డాంగ్ ప్రావిన్సులోని ఓ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేశారు. ఈ సమయంలో సీపీసీ నేత బిన్హుయ్ కుమార్తె జెన్నా వాంగ్‌తో ప్రేమలో పడ్డారు. వారాంతాల్లో హాంకాంగ్ వెళ్లే వాల్జ్ తనకోసం ఖరీదైన బహుమతులు తేచ్చారని వాంగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను అమెరికాలో స్థిరపడడంపై ఎన్నో కలలు కనేదాన్నని, వాల్జ్ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేవారు కాదని ఆమె పేర్కొన్నారు. ఓ సారి తమ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. దాంతో తమ బంధం విడిపోయిందని వాల్జ్ అమెరికాకు, తాను ఇటలీకి వెళ్లిపోయినట్లు వివరించారు. టిమ్ వాల్జ్ 1993లో గ్వెన్ విప్పల్ అనే మహిళను వివాహం చేసుకున్నారు.













