అగ్రరాజ్యానికి ఇదో భయంకరమైన రోజు : ట్రంప్
జోర్డాన్‌లోని తమ దేశ సైనిక స్థావరంపై డ్రోన్ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి ఇదో భయంకరమైన రోజు అన్నారు. అమెరికా బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. మనం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకునేవి కాదన్నారు. బైడెన్ ప్రభుత్వ బలహీనత కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇటువంటిది సంభవించే అవకాశమే లేకపోయేది. ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనేది. దీనికి విరుద్ధంగా ప్రస్తుతం మనం మూడో ప్రపంచ యుద్ధం అంచున్నా ఉన్నాం అని ట్రంప్ పేర్కొన్నారు.






