డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారెంట్
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పనున్న డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారిని హత్య చేసిన కేసులో ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్ దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్ ఆదేశించారు. అబూ మహదీ అల్ ముహండిస్ కుటుంబం నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిన తరువాత వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ వెల్లడించింది.
బాగ్దాద్‌లో గత ఏడాది జనవరి 3న వైమానికి దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్ సహకారాన్ని అభ్యర్థించింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.






