మణిపుర్ ఘటన పై అమెరికా దిగ్భ్రాంతి
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించారు. దీనిపై తాజాగా అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మణిపుర్ ఘర్షణలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి (ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ ) వేదాంత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపుర్లో ఇద్దరు మహిళలపై చోటుచేసుకున్న విపరీత ప్రవర్తనకు సంబంధించిన వీడియో మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన బాధితులకు మేం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వారికి న్యాయం చేయడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతుగా నిలుస్తాం అని పటేల్ పేర్కొన్నారు. మణిపుర్ లో ఆమోదయోగ్యమైన శాంతియుత పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దుతుగా ఉంటుందని మరోసారి గుర్తు చేశారు.






