అభిశంసన నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి మరోసారి బయటపడ్డారు. రెండో అభిశంసన విచారణలో భాగంగా 100 మంది సభ్యులున్న సెనేట్‌లో ఓటింగ్ పక్రియ జరిగింది. ట్రంప్‌పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గేందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యులు అంటే కనీసం 67 మంది సభ్యుల మద్దతు అవసరం. కావలసిన ఓట్లకు 10 ఓట్లు తక్కువ వచ్చాయి. దీంతో అభిశంసన నుంచి ట్రంప్ బయటపడ్డట్లయింది. అయితే ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్లు ఓటేయడం గమనార్హం.
అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసన విచారణ ఎదుర్కొన్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డులకెక్కారు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ కార్యకలాపాలకు అడ్డుపడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఫిబ్రవరి 5, 2020లో తొలిసారిగా సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభిశంసన నుంచి ట్రంప్ బయటపడటంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం సులుభంగా ధ్వంసమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి అమెరికన్ పౌరుడిపై ఉన్నదన్నారు.
అభిశంసన నుంచి గట్టెక్కిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అసలైన రాజకీయ ప్రజా ఉద్యమం ఇప్పుడే మొదలైందని ప్రకటించారు. అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చారిత్రక, దేశభక్తితో కూడిన గొప్ప ఉద్యమం.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఇప్పుడే మొదలైంది అన్నారు.






