భారత్‌పై అమెరికా ఆంక్షలు ?
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పై గుర్రుమంటున్న అమెరికా, కాట్సా చట్టం మేరకు ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అంక్షలు విధించాలా, మినహాయింపు ఇవ్వాలా అనే విషయమై అమెరికా అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిజానికి అమెరికాకు అనేక రంగాల్లో భారత్ కీలక, అతిపెద్ద భాగస్వామి. 2018 అక్టోబర్‌లో 5 ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లను కొనుగోలు చేసుకునేందుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని అప్పటి ట్రంప్ ప్రభుత్వం తప్పుపట్టింది. భారత్‌పై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని ట్రంప్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది.
గతంలో రష్యా నుంచి ఇదే యాంటి మిసైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తూ ఆంక్షలు విధించింది. అదే తరహాలో ఇప్పుడు భారత్‌పైనా ఆంక్షలు విధించే అంశాన్ని బైడెన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక్కడ ఒక కీలక అంశాన్ని పరిశీలించాలి. టర్కీ రష్యాకు మిత్రదేశం కాగా అమెరికాకు వ్యతిరేకి. కానీ భారత్ అమెరికాతో కీలక భాగస్వామి. మరోవైపు రష్యాతో అనేక ఆయుధ, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ నేపథ్యంలో ఐరాస సమావేశాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటూ తటస్ఠ వైఖరిని అవలంభిస్తున్న భారత్‌పై అమెరికా ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్న.






