India : భారత్ లో 3 అణు కేంద్రాలపై ఆంక్షల తొలగింపు : అమెరికా నిర్ణయం

భారత్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై ఆంక్షలను అమెరికా (America ) తొలగించింది. ఈ మేరకు యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ( బీఐఎస్) ఒక ప్రకటన చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ (Jake Sullivan) భారత్‌లో పర్యటించిన వారం రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడిరది. పౌర అణు భాగస్వామ్యం విషయంలో రెండు దేశాల సంస్థ మధ్య నెలకొన్న అడ్డంకులను తాము తొలగిస్తున్నట్లు నాటి పర్యటనలో ఆయన తెలిపారు. ఈ మేరకు భాభా అణు పరిశోధన కేంద్రం, ఇందిరా గాంధీ అణు పరిశోధన కేంద్రం, ఇండియన్ రేర్ ఎర్త్స్‌పై ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తివేసింది. 16 ఏళ్ల కిందట కుదిరిన అణు ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బైడెన్ సర్కార్ (Biden government) ఈ నిర్ణయం తీసుకుంది.