కమలా హారిస్ కు అమెరికన్ లు షాక్…
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. వీపీగా ఆమె తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తేల్చి పడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశం అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. అమెరికా ఉపాధ్యక్ష పదవిని అదిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె అధికారం చేపట్టి దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ వంటి స్థానిక మీడియా చేసిన సర్వేలో ఉపాధ్యక్షురాలిగా ఆమె పని తీరు అస్సలు బాగోలేదని మెజారిటీ ప్రజలు స్పష్టం చేశారు. తాజాగా జరిగిన రెండు సర్వేల్లో 46 శాతం మంది ప్రజలు మాత్రమే వీపీగా కమలా హారీస్ పనితీరును మెచ్చుకున్నట్టు తేలింది. దాదాపు 48 శాతం మంది ప్రజలు ఆమె పనితీరుపై పెదవి విరిచారట.
1970 తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే అత్యంత తక్కువ ప్రజాధారణ పొందిన ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గుర్తింపు పొందారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అధినేతగా బైడెన్ పనితీరు బాగుందని 51.3 శాతం మంది ప్రజలు కితాబిచ్చారట. సుమారు 44.9 శాతం మంది ప్రజలు బైడెన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.






