డొనాల్డ్ ట్రంప్ పై ముందే వేటు?
అమెరికా క్యాపిటల్‌పై దాడి ఘటనతో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఉన్న అవకాశాలపై ఆయన మంత్రివర్గం చర్చిస్తున్నది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు.. అంటే మరో 13 రోజులే ట్రంప్ పదవిలో ఉంటారు. ఆలోపే ట్రంప్‌ను తొలగించాలని, ఏమాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అధ్యక్షుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనప్పుడు అమెరికా రాజ్యాంగం 25వ సవరణ ప్రకారం ఆయనను తొలగించే అధికారం ఉపాధ్యక్షుడికి, మంత్రివర్గానికి ఉంటుంది. అధ్యక్షుడి తొలగింపునకు అవసరమయ్యే ఓటింగ్ ప్రక్రియకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యం వహించాల్సి ఉంటుంది.
అధ్యక్షుడిని తొలగించేందుకు మరో మార్గం అభిశంసన తీర్మానం. మరోవైపు, వెంటనే ట్రంప్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హౌస్ జ్యుడీషియరీ కమిటీకి చెందిన డెమోక్రాట్లు పెన్స్‌కు లేఖ రాశారు. ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బట్టి ఆయనకు మతి భ్రమించిందని రుజువు అవుతున్నదని విమర్శించారు.






