వలసదారులకు శుభవార్త!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ తొలి రోజే వలసదారులకు శుభవార్త చెప్పనున్నారు. ఇప్పటికే బైడెన్ ఒక బిల్లును రూపొందించారని, చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు 1.10 కోట్ల మందికి ఊరట కలిగించేలా ఆ బిల్లు ఉంటుందనేది సమాచారం. ట్రంప్ తన హయాంలో వలసదారులపట్ల కఠిన విధానాలను అవలంభించారు. అయితే, వలసదారులకు స్వాంతన కలిగేలా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు బైడెన్ బిల్లును తీసుకు వస్తున్నారు.
బైడెన్ తీసుకురానున్న ఆ నూతన బిలుల ప్రకారం వచ్చే ఎనిమిదేండ్ల కాలంలో అమెరికాలో ఉంటున్న వలసదారులంతా చట్టబద్ధ హోదా పొందేందుకు వీలుంటుంది. ఈ నెల ఒకటో తేదీ నాటికి అమెరికాలో తగిన చట్టబద్ద హోదా లేకుండా నివసిస్తున్న అందరికీ పదేండ్లపాటు తాత్కాలిక చట్టబద్ధత కల్పిస్తారు. వారంతా డాక్యుమెంట్స్ తనిఖీ చేయించుకుని పన్నులు చెల్లించడంతో పాటు ఇతరత్రా కార్యకలాపాలు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత పౌరసత్వాన్ని సాధించడానికి మూడేండ్ల గడువు ఉంటుంది.
ఇప్పటికే అమెరికాలో వివిధ పనులు చేస్తున్న కొందరు వలసదారులకు త్వరగానే ఈ చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ పూర్తికానుంది. పిల్లలుగా అమెరికాకు వచ్చినవారు, వ్యవసాయ కార్మికులు, తాత్కాలిక రక్షణ హోదాతో వచ్చినవారు త్వరగా గ్రీన్‌కార్డు అర్హత పొందడానికి వీలుంటుంది. అదేవిధంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అమెరికాకు వలసలు రావడాన్ని అడ్డుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ రద్దు చేసే అవకాశం ఉంది.






