భానిసత్వంపై పెదవి మెదపని నిక్కీ హేలీ
అమెరికాలో 1861-1865 మధ్య అంతర్యుద్ధం జరగడానికి కారణమేమిటని న్యూ హాంప్షైర్ ఓటరు ఒకరు అడిగిన ప్రశ్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీకి చిక్కు స్థితిని కల్పించింది. ఆ ప్రశ్నకు సమాధానంలో బానిసత్వాన్ని ఆమె ప్రస్తావించలేదు. ఆమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం హేలీ పోటీ పడుతున్నారు. ఓటరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ప్రభుత్వ పాత్ర వ్యక్తిగత స్వేచ్ఛ, పెట్టుబడిదారీ విధానం గురించి చెప్పుకొచ్చారే తప్ప బానిసత్వ రద్దుకే అంతర్యుద్ధం జరిగిందని మాటమాత్రమైనా అనలేదు. 2023 సంవత్సరంలో కూడా ఇలాంటి సమాధానం రావడం దిగ్బ్రాంతికరమని ఓటరు వ్యాఖ్యానించారు. హేలీ రెండుసార్లు గవర్నర్గా వ్యవహరించిన దక్షిణ కరోలినా రాష్ట్రం అమెరికాలో దక్షిణ భాగానికి చెందినది. ఆ ప్రాంతంలో నల్లజాతివారు బానిసలుగా ఉండేవారు. బానిసత్వాన్ని రద్దు చేసిన అమెరికా ఉత్తర భాగం దక్షిణాదిలో కూడా దాన్ని వర్తింపజేయడానికి ప్రయత్నించడం అంతర్యుద్ధానికి కారణమైంది.






