18 సభలు… 30 వేల కేసులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం ఆయన మద్దతుదారుల చావుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య నిర్వహించిన సభల్లో పాల్గొన్న 30 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వీరిలో 700 మందికిపైగా చనిపోయారు. ప్రచార సభలు జరిగిన ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్దసంఖ్యలో జనం గుమికూడటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ అధ్యయనాన్ని డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ట్వీట్ చేశారు. ట్రంప్ మిమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోరు. కనీసం మద్దతుదారుల ఆరోగ్యం మీద కూడా ఆయనకు శ్రద్ధ లేదు అని విమర్శించారు. ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ట్రంప్ అన్నారు. 2016లో ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పెన్సిల్వేనియాలో నాలుగు సభల్లో ఆయన ప్రసంగించారు. బిడెన్ అవినీతిపరుడని, ఆయన గెలిస్తే పన్నులు విపరీతంగా పెరుగుతాయని ఆరోపించారు.






