Donald Trump : ట్రంప్ ఆరోగ్యం భేష్ … వైట్‌హౌస్ వైద్యుడి ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) (78) పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వైద్యుడు, నేవీ కెప్టెన్ సియాన్ బార్బబెల్లా (Sian Barbabella) తేల్చారు. చురుకైన జీవనశైలి దీనికి కారణమని తెలిపారు. అధ్యక్షుడికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను శ్వేతసౌధం (White House) విడుదల చేసింది. 2020లో నిర్వహించిన వైద్య పరీక్షల సమయంలో 244 పౌండ్ల బరువున్న ట్రంప్ ఇప్పుడు 20 పౌండ్లు తగ్గారు. గతంలో ఆయనకు కాటరాక్ట్ శస్త్రచికిత్స జరిగింది. రోజూ సభలు, సమావేశాల్లో పాల్గొనడంతో పాటు తరచూ ఆయన గోల్ఫ్ ఆడతారు. 2018లో ఆయన కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయి 223 ఉంటే ఇప్పుడు 140కి తగ్గింది. రక్తపోటు 128/74. ఇది కాస్త ఎక్కువే. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటివారు హైబీపీ బారిన పడే అవకాశాలుంటాయి. ఆయన గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 62 సార్లు. ఇది మునుపటిలాగా ఉంది. గుండె పోటు ముప్పును తగ్గించుకునేందుకు ఆయన ఆస్పిరిన్ కూడా తీసుకుంటారు అని నివేదిక పేర్కొంది.