డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన కమలా హారిస్
ఫాక్స్ న్యూస్ చానెల్లో డిబేట్కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తోసిపుచ్చారు. నిజానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఆయనతో సెప్టెంబర్ 10న ఏబీసీ చానల్లో రెండో డిబేట్కు ట్రంప్ అంగీకరించారు. అనంతరం బైడెన్ బదులు హారిస్ అభ్యర్థి అవడం తెలిసిందే. ఏబీసీ బదులు ఫాక్స్ న్యూస్ చానల్లో సెప్టెంబర్ 4న డిబేట్కు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. దీన్ని హారిస్ తప్పుబట్టారు. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న ట్రంప్ ఇప్పుడేమో ఫలానా సమయంలో, ఫలానా చోటే అనడం ఆశ్చర్యకరం. అంగీకరించిన మేరకు సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్లో చర్చకు నేను సిద్ధం. ఆయన పాల్గొంటారని ఆశిస్తున్నా అన్నారు. డిబేట్కు ట్రంప్ భయపడుతున్నారని హారిస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది. ఆయన తమాషాలు మానుకోవాలని హితవు పలికింది.






