ఆయన్ను ఓడించేందుకు అమెరికన్లు సిద్ధం : హారిస్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆరోపించారు. ఆయన చర్యలు ప్రజల విలువను తగ్గించేలా ఉంటున్నాయంటూ విమర్శించారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్‌ను ఓడించడం ద్వారా దేశానికి నవ్య పథాన్ని నిర్దేధించాలని అమెరికన్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఆయనది ముగిసిన అధ్యామేనన్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున బరిలో నిలిచిన హారిస్ తాజాగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యాక ఆమె మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి.
అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేబినెట్లోకి రిపబ్లికన్ పార్టీ వ్యక్తిని కూడా తీసుకుంటానని హారిస్ తెలిపారు. ఎవరికి చోటివ్వాలన్నదానిపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. చమురు వెలికితీత, వలస విధానాల విషయంలో ప్లేటు ఫిరాయించారంటూ తనపై వస్తున్న విమర్శలను హారిస్ తోసిపుచ్చారు. కాలనుగుణంగా కొన్ని నిర్ణయాలను మార్చుకున్నప్పటికీ తాను పాటించే విలువల్లో మార్పు రాలేదని స్పష్టం చేశారు. తాను అధ్యక్షురాలినైతే చమురు వెలికితీతను నిషేధించబోనన్నారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని ప్రకటించారు.






