ఆసియావారి భద్రతకు బైడెన్ బాధ్యత
వాషింగ్టన్ః దేశంలో కరోనా వైరస్ ప్రారంభమైన నాటి నుంచి ఆసియాకు చెందిన అమెరికన్లపై దాడులు పెరగడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విద్వేషాలను, విషపూరిత దాడులకు సహించమని, ఇది అమెరికన్ల నైజానికి పూర్తిగా విరుద్ధమని ఆయన హెచ్చరించారు. వాటిని తక్షణం నిలిపివేయాలని ఆయన ఆదేశించారు.
ఆయన తన మొట్టమొదటి ‘ప్రైమ్‌టైమ్’ ప్రసంగంలో కోవిడ్‌పై పోరాటంలో పురోగతి గురించి సాకల్యంగా వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏదో ఒక కారణంతో మనం ఒకరిపై ఒకరు తిరగబడుతున్నాం’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో ఆవిర్భవించినట్టు చెబుతున్న ఈ వైరస్‌ను అడ్డం పెట్టుకుని, అమెరికాలోని ఆసియా సంతతివారిపై దాడులు చేయడం, వారిని వేధించడం, బలిపశువులను చేయడం జరుగుతోందని, ఈ ద్వేషపూరిత నేరాలను తాము సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
నిజానికి చాలామంది అమెరికన్లు తమ దేశంలో స్థిరపడ్డ ఆసియా సంతతివారిని ఆదుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారని, వారికి భద్రత కల్పించడంతో పాటు, వారిని వైరస్ బారి నుంచి కూడా కాపాడడానికి శాయశక్తులా పాటుబడ్డారని బైడెన్ వివరించారు. అయితే, చివరికి ఈ అమెరికన్లు కూడా భయాందోళనలతో బితుకు బితుకుమంటూ బతకాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని ఆయన అన్నారు. ‘‘ఇది తప్పు. ఇది అమెరికన్ నైజానికి విరుద్ధం. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనిని ఆపాల్సిందే’’ అని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో స్థిరపడి, ఇక్కడి ఆర్థికాభివృద్ధికి ఎంతో పాటుబడుతున్న ఆసియావారిపై ఇక దాడులు జరగనివ్వమని, వారి భద్రత బాధ్యత తమదేనని ఆయన హామీ ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరులు కరోనా వైరస్‌ను ‘చైనా వైరస్’గా అభివర్ణించిన దగ్గర నుంచి దేశంలో ఆసియా సంతతివారిపై దాడులు పెరిగిపోయాయని బైడెన్ సన్నిహితులు వ్యాఖ్యానించారు.
దాడులకు సంబంధించి అనేక కేసుల్లో ‘విద్వేష నేరాలు’ అని చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలు లభించనప్పటికీ, ఆసియా వ్యతిరేక దాడులు పెరిగాని మాత్రం రూఢిగా చెప్పవచ్చని వారు తెలిపారు. న్యూయార్క్, లాస్ఏంజిలిస్తో సహా అమెరికా వ్యాప్తంగా 16 ప్రధాన నగరాలలో ఆసియా సంతతివారిపై దాడులు జరిగాయని, ఈ కేసుల సంఖ్య 49 నుంచి 122కు పెరిగిందని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం తెలియజేసింది. విచిత్రంగా, ఇతర విద్వేషపూరిత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని కూడా అది తెలిపింది.
కాగా, పోలీసుల రికార్డుల ద్వారా తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం, నిరుడు అనేక దాడులకు సంబంధించిన కేసుల్లో జాతి విద్వేషం ప్రస్ఫుటంగా కనిపించినట్టు తెలిసింది. పౌర హక్కులకు సంబంధించిన మరికొన్ని వర్గాల అధ్యయనం ప్రకారం, గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దేశంలో 2800 జాతి విద్వేష, జాతి వివక్షకు సంబంధించిన నేరాలు జరిగాయని, ఇవన్నీ చైనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకునే జరిగినట్టు కనిపిస్తోందని వెల్లడైంది.






