ఆరిజోనా రాష్ట్రంలో బైడెన్ గెలుపు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆరిజోనా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ గెలుపొందినట్లు తాజాగా వెల్లడైంది. దీంతో బైడెన్ ఎలక్టోరల్ ఓట్లు 290కి చేరుకున్నాయి. ఎన్నికల్లో 270 మార్క్ దాటితే అధ్యక్షత బాధ్యతలు చేపట్టవచ్చు. కానీ బైడెన్ ఆ మార్క్‌ను ఎప్పుడో దాటేశారు. గురువారం రాత్రి ఆరిజోనా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. దాదాపు వారం రోజుల పాటు ఆ రాష్ట్రంలో కౌంటింగ్ జరిగింది. సాంప్రదాయంగా రిపబ్లికన్ల కంచుకోట అయిన ఆరిజోనాలో బైడెన్ గెలవడం చరిత్రాత్మకం.
ఈ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాల్లో డెమోక్రాట్ గెలవడం ఇది రెండవసారి. పాపులర్ ఓటులోనూ బైడెన్ దూసుకెళ్లారు. పాపులర్ ఓటులో ఆయన 53 లక్షల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. 34 శాతం పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మరో మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష రేసు ఓ క్లారిటీకి వచ్చేసింది. ఆరిజోనా రాష్ట్రంలో మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు అన్నీ బైడెన్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు ఎడిషన్ రీసర్చ్ పేర్కొన్నది.






