మరో ట్రంప్ విధానం బుట్టదాఖలు
కన్స్యూమర్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో పునరుద్ధరణకు బైడెన్ నిర్ణయం
వాషింగ్టన్ః వినియోగదారుల హక్కులకు, ప్రయోజనాలకు భద్రత కల్పించే మరో కొత్త నిర్ణయాన్ని జో బైడెన్ ప్రభుత్వం చేపట్టింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని బుట్టదాఖలు చేస్తూ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటున్న దశలో ఈ విధానాన్ని కొనసాగించడం ప్రజలకు తీరని నష్టం కలిగిస్తుందే తప్ప ఏమాత్రం ఉపకరించదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
కన్స్యూమర్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సి.ఎఫ్.పి.బి)ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, దీనిని మరింతగా పటిష్ఠం చేసి, రాజకీయాలకు అతీతంగా మలచి, ప్రజలకు మేలు చేకూర్చాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. వినియోగదారులకు ఆర్థిక సహాయం అందజేయడానికి, వారి హక్కులు కాపాడడానికి ఉద్దేశించిన ఈ బ్యూరోను ట్రంప్ ప్రభుత్వం రాజకీయం చేయడంతో పాటు, అది తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించకుండా చేసింది. అమెరికన్లతో పాటు, అమెరికాలో స్థిరపడిని ఇతర దేశాల వారికి, ముఖ్యంగా నల్లజాతీయులకు ఈ బ్యూరో ఎంతో సహాయకారిగా ఉండేది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ బ్యూరోను ఒబామా ప్రభుత్వం ఆరంభించింది.
కరోనా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిలబడినందు వల్ల ఈ బ్యూరోను కొనసాగించలేమనే కారణంతో దీని&్న రద్దు చేయాలని ట్రంప్ భావించారు కానీ, ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, దీన్ని ఇతరత్రా బలహీనపరచడానికి శాయశక్తులా కృషి చేశారు.
వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగానే ఇటువంటి బ్యూరో అవసరమని భావించిన బైడెన్ దీన్ని మరింత శక్తిమంతం చేసి ప్రజలకు మరించ చేరువయ్యేలా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ఆదేశాల మేరకు డెమోక్రాటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యులు, ఆర్థిక నిపుణులు, బ్యూరో సిబ్బంది కలిసి దీన్ని పునరుద్ధరించడానికి రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారు.
బైడెన్‌కు పెద్ద సవాలు
దీని పునరుద్ధరణను ఒక పెద్ద సవాలుగా తీసుకున్న బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రుణాలను ఇవ్వడం, పెట్టుబడిని సమకూర్చడం, ఇతరత్రా ఆర్థిక సహాయం అందజేయడం వంటి అంశాలలో ఇతర దేశస్థుల పట్ల, ముఖ్యంగా నల్లజాతీయుల పట్ల వివక్షను ప్రదర్శించడానికే ఈ బ్యూరోను బలహీనపరచారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి దీన్ని పునరుద్ధరిస్తామని బైడెన్ పదే పదే చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం నల్లజాతీయులు, ఇతర దేశాలకు చెందినవారి పట్ల నిస్సిగ్గుగా వివక్షను ప్రదర్శించిందని, ఈ దిశగా ఆ ప్రభుత్వం కరోనా సమయంలో ఇతరత్రా అనేక చర్యలు చేపట్టడం కూడా జరిగిందని డెమోక్రాట్లు విమర్శించారు.
ఈ బ్యూరోలో పూర్తి స్థాయిలో సిబ్బందిని భర్తీ చేసి, దీన్ని మరింత శక్తిమంతం చేసే పక్షంలో దేశంలోని కోట్లాది మంది దిగువ, మధ్య తరగతి అమెరికన్లు ఎంతగానో లబ్ధి పొందుతారని బైడెన్ భావిస్తున్నారు. ఈ బ్యూరో సరిగ్గా పని చేయనందు వల్ల గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా కరోనా సమయంలో, అత్యధిక సంఖ్యాక సాధారణ అమెరికన్లు ఆర్థిక సహాయ సంస్థల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ సంస్థలు పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్థికంగా పీల్చి పిప్పిచేశాయి.
ఒకప్పుడు ఈ బ్యూరోను ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసిన డెమోక్రాట్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ఈ సంస్థ గురించి మాట్లాడుతూ, ”మళ్లీ కాపలాదారు కర్ర పట్టుకుని బయలుదేరాడు. ఇక ఆర్థిక సహాయ సంస్థల ఆటలు సాగవు. ఖబడ్దార్” అని హెచ్చరించారు. ”ట్రంప్ కొన్ని పెద్ద బ్యాంకులను, నకిలీ ఆర్థిక సహాయ సంస్థలను ఆదుకోవడానికి బ్యూరోను నాశనం చేశారు. పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఖాతరు చేయలేదు. బైడెన్ ఇటువంటి విధానాలన్నిటినీ ఇక బుట్టదాఖలు చేయబోతున్నారు” అని వారెన్ పేర్కొన్నారు.
బ్యూరోకు జవజీవాలు
అధికారంలోకి వచ్చీ రాగానే ట్రంప్ ఈ బ్యూరోకు అధిపతిగా రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు మిక్ మల్వానీని నియమించారు. ఆయన ఈ బ్యూరోను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆయన ఈ బ్యూరోకు సిబ్బందిని తీసుకోవడాన్ని నిలిపివేశారు. రుణాలు ఎగ్గొట్టినవారిపై దర్యాప్తులు జరపడం, వారి నుంచి జరిమానాలు వసూలు చేయడం వంటి ప్రధాన చర్యలకు కూడా స్వస్తి చెప్పారు. ఒక నిఘా సంస్థగా, ఒక న్యాయ నిర్ణయ సంస్థగా దీనికున్న అధికారాలను కత్తిరించారు. ఫలితంగా దేశంలో ప్రైవేట్ ఆర్థిక సహాయ సంస్థలు బాగా లబ్ధి పొందాయి. పైగా దీనికి బడ్జెట్లో నిధులు కేటాయించడం కూడా తగ్గించేశారు. సహజంగానే ఈ చర్యలు ఇటు డెమోక్రాట్లకు, అటు వినియోగదార్లకు తీవ్ర ఆందోళన కలిగించాయి.
మల్వానీ తర్వాత అధికారం చేపట్టిన కేతీ క్రానింజర్ కూడా మలానీ బాటలోనే నడిచారు. బైడెన్ అధికారంలోకి వచ్చీ రాగానే ముందుగా క్రానింజర్తో రాజీనామా చేయించారు. కాగా, ఆ సంస్థకు అధిపతిగా బైడెన్ నియమించిన డేవ్ యూజియో ఈ రంగంలో అనుభవం గడించిన వ్యక్తి. ఆయన ఈ బ్యూరోకు అధిపతిగా బాధ్యతలు చేపట్టగానే, కొత్త సిబ్బంది నియామకం ప్రారంభమైంది. ”కరోనా వైరస్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న పేద, మధ్యతరగతి అమెరికన్లకు పెద్ద ఎత్తున సహాయం అందించడం ప్రారంభించాం. మేం వివక్షను ప్రదర్శించే ప్రసక్తే లేదు. బ్యూరోను పూర్వ స్థాయికి తీసుకు వస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.






