రక్షణ శాఖ మంత్రిగా ఆఫ్రికన్-అమెరికన్ లాయిడ్ ఆస్టిన్
అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన కేబినెట్లోకి తీసుకున్న కొంతమంది మంత్రుల పేర్లు వెల్లడించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ అయిన లాయిడ్ ఆస్టిన్ను ఎన్నుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఆఫ్రికన్-అమెరికన్‌కి పదవిని కట్టబెట్టారు. ట్రంప్ హయాంలో జరిగిన జాత్యంహకార ఆందోళనలే.. బైడెన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు ఆర్మీకి సేవలందించారు. 2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్లో ఒకటైన రేథియాస్ టెక్నాలజీస్ బోర్డు ఆప్ డైరెక్టర్లలో చేరారు.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్‌కి, ఆస్టిన్కి మధ్య మంచి సంబంధాలుండేవి. తన కేబినెట్లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ప్లోర్నోరు ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బైడెన్ ఆస్టిన్ నియామకం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్‌కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం.






