భద్రతా మండలిలో భారత్ కు బైడెన్ బృందం మద్దతు
ఇండో-యూఎస్ సంబంధాల బలోపేతానికి జో బైడెన్ బృందం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా, ఐరాస భద్రత మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వ అభ్యర్థనకు మద్దతివ్వాలని భావిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రిగా ఎంపికైన ఆంటోనీ బ్లింకెన్ తొలిసారి భారత్ గురించి చేసిన వ్యాఖ్యల్లో ఈ అంశాలను వెల్లడించారు. చైనాను ఎదుర్కొవడంలో అమెరికాకు భారత దేశం కీలక భాగస్వామి అని బైడెన్ శిబిరం తెలిపింది. తీవ్రవాద నిర్మూనలో సహకారం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్యం అంశాలపై అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ బృందం విధాన పాలసీని విడుదల చేసింది. ఇందులో భారత్తో సంబంధాల బలోపేతాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజాగా ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ చైనాను ఎదుర్కోవడం భారత్, అమెరికాలకు ఉమ్మడి సవాలు. బైడెన్ అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, భారతదేశంలో ప్రజాస్వామిక సంబంధాలను నవీకరించేందుకు కృషి చేస్తారు. అమెరికాకు భారత్ సన్నిహిత భాగస్వామి అని తెలిపారు. బరాక్ ఒబామా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి కీలక భాగస్వామిగా భారత దేశాన్ని నిలిపేందుకు తాము విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థల్లో భారత్కు ప్రముఖ పాత్ర లభించే విధంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తుందన్నారు.






