Joe Biden: జో బైడెన్ మరో కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బైడెన్ (Biden) మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే కొందరు అధికారులు, మిత్రులకు క్షమాభిక్ష అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ (Trump) బాధ్యతలు చేపట్టాక బైడెన్ అనుకూలదారులు, అధికారులను, మిత్రులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు భావిస్తున్నారు. అందుకే తాను బాధ్యతల నుంచి వైదొలగకముందే వారందరికీ క్షమాభిక్ష అమలు చేయాలని యోచిస్తున్నారట. ఈ మేరకు సీనియర్ సహాయకులు, వైట్‌హౌస్ లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మాజీ ప్రత్యేక సలహాదారు ఆంథోనీ ఫౌసీ, ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే మాజీ చట్టసభ సభ్యుడు లిజ్ చెనీ, కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ తదితరులు ఈ క్షమాభిక్ష అమలు లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఇతర క్షమాపణలు అంశంపై బైడెన్ సమీక్షిస్తున్నారు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ పేర్కొన్నారు.






