అమెరికా అధ్యక్షుడు కన్నా.. కమలా సంపాదన ఎక్కువ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ 2020 ఏడాదికి సంబంధించిన వారి ట్యాక్స్ రిటర్న్ వివరాలను వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆయన సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ తమ ట్యాక్స్ రిటర్న్, ఆదాయం వివరాలను వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ 2019లో 9.85 లక్షల డాలర్లుగా (రూ.7.21 కోట్లు) ఉన్న వారి స్థూల ఆదాయం 2020లో 6.21 లక్షల డాలర్లకు (సుమారు రూ.4.44 కోట్లు) పడిపోయింది. ఈ అధ్యక్ష జంట 2020 ఏడాదికి గాను 1.57 లక్షల డాలర్లు (రూ.1.15 కోట్లు) ఆదాయపు పన్ను చెల్లించారు. అంటే ఇది వారి ఆదాయంలో 25.9 శాతం.
అదే విధంగా ఉపాధ్యక్షురాలు కమల, తన భర్త డగ్ ఎమ్హాఫ్ సంయుక్తంగా తమ ఆస్తుల వివరాలను తెలియజేశారు. 2020లో వారి స్థూల ఆదాయం 16.95 లక్షల డాలర్లు (సుమారు రూ.12.41 కోట్లు). దీంట్లో ఈ ఉపాధ్యక్ష దంపతులు 6.21 లక్షల డాలర్లు (రూ.4.55 కోట్లు) పన్ను రూపంలో చెల్లించారు. అంటే ఇది వారి ఆదాయంలో 36.7 శాతం అన్నమాట.దీని ప్రకారం అధ్యక్షుడి సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలి ఆదాయమే అధికమని తేలింది. కమలాకు సుమారు 1 మిలియన్ డాలర్ల సంపాదన ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. 2020లో ఉపాధ్యక్షురాలి ఆదాయం రూ.12.41 కోట్లుగా ఉంటే, బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లు మాత్రమే.
అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య కూడా 30 వేల డాలర్ల విరాళాలు ఇచ్చారు. అంటే, తన ఆదాయంలో 5.1 శాతం విరాళంగా ఇచ్చాడు. యూఎస్ చట్ట ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వారి ఆర్థిక సమచారాన్ని బహిరంగపరచాలి. దాంతో ఇద్దరి ఆదాయ, వ్యయాలు వైట్‍హౌస్ నుంచి బహిరంగపరిచారు.